రైతులు ఆందోళన చెందవద్దు..తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం :  అన్వేష్​ రెడ్డి

రైతులు ఆందోళన చెందవద్దు..తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం :  అన్వేష్​ రెడ్డి
  • రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్​ రెడ్డి

సారంగాపూర్, వెలుగు: రైతులు ఆందోళన చెందొద్దు అని, వర్షాలకు తడిసిన ధాన్యాని కొనుగోలు చేస్తామని  తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి భరోసా ఇచ్చారు. సారంగాపూర్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం సందర్శించి ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన వడ్లను పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కారు రైతుల సంక్షేమ కోసం పని చేస్తోందన్నారు.

2023 యాసంగిలో 36 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ ఏడాది 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి వరి ధాన్యాన్ని కొన్నామని తెలిపారు. గత ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని  కొనుగొలు చేయలేక, కరువు పేరుతో రైతులను దోచుకున్నదని విమర్శించారు. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న చివరి గింజను కూడా ప్రభుత్వం కొంటుందని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని అడెల్లి మహా పోచమ్మ దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 

నిర్మల్, సారంగాపూర్ మాజీ జడ్పీటీసీలు తాజా, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ సుజాత నర్సారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ అహ్మద్ ముక్తార్, కాంగ్రెస్ నాయకులు ఓలత్రి నారాయణ రెడ్డి, అట్ల ముత్యం రెడ్డి, కండెల భూమన్న, నక్క రాజన్న తదితరులు పాల్గొన్నారు.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

ఖానాపూర్, వెలుగు: ఆకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని ఖానాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజిద్, మున్సిపల్ మాజీ చైర్మన్ చిన్నం సత్యం  అన్నారు. ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు  కేంద్రాన్ని ఆదివారం  వారు  పరిశీలించారు.

వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే వరకు కేంద్రాల నిర్వహణ ఉంటుందన్నారు. సెంటర్ లో గన్నీ బ్యాగుల కొరత ఉందని రైతులు వారి దృష్టికి తీసుకె ళ్లగా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. మాజీ సర్పంచ్ చిన్నం రవీందర్, మాజీ ఎంపీటీసీ సంజీవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.